Lalo: రికార్డు సృష్టించిన చిన్న సినిమా

Lalo Gujarati Movie Creates Record with Small Budget
  • రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన గుజరాతీ చిత్రం 'లాలో'
  • రూ.100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తూ సరికొత్త చరిత్ర
  • మౌత్ టాక్‌తో అనూహ్య విజయం సాధించిన సినిమా
  • ఈ నెల 28న దేశవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు
భారీ తారాగణం లేదు, పాన్-ఇండియా స్థాయిలో ప్రచారం అంతకన్నా లేదు. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ గుజరాతీ సినిమా ఇప్పుడు రూ.100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తూ చరిత్ర సృష్టించబోతోంది. ఆ చిత్రమే 'లాలో - కృష్ణ సదా సహాయతే'. కథలో ఉన్న బలమే పెట్టుబడిగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది.

ఏడు వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలో ఆదరణ కరువైంది. తొలివారం కేవలం రూ.26 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే, కథ బాగుండటంతో నెమ్మదిగా మౌత్ టాక్ పుంజుకుంది. ఇదే సినిమాకు అతిపెద్ద ప్రచారంగా మారింది. నాలుగో వారం నుంచి వసూళ్లలో అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. ఆరో వారం ముగిసేసరికి రూ.70 కోట్లకు పైగా వసూలు చేసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఏడో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ విజయంతో 'లాలో' గుజరాతీ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు రూ.50 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న 'చాల్ జీవి లాయియే' (2019) రికార్డును ఇది బద్దలు కొట్టింది. ఇప్పుడు తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర విజయంతో దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 28న హిందీ డబ్బింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీవా రచ్, శ్రుహద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. గతం తాలూకు బాధలతో సతమతమయ్యే లాలో అనే రిక్షా డ్రైవర్, అనుకోకుండా ఓ ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. అక్కడ అతనికి కలిగే ఆధ్యాత్మిక అనుభవాలు, శ్రీకృష్ణుడి లీలలు తన జీవితాన్ని ఎలా మార్చాయన్నదే ఈ చిత్ర కథాంశం. 
Lalo
Gujarati movie
Lalo Krishna Sada Sahayate
Ankit Sakhiya
Reeva Rach
Shruhad Goswami
box office collection
Indian cinema
Chal Jeevi Laiye
Hindi dubbing

More Telugu News