దుబాయ్ ఎయిర్ షోలో 'తేజస్' కూలిపోవడంపై స్పందించిన హెచ్ఏఎల్

HAL Responds to Tejas Fighter Jet Crash at Dubai Airshow
  • ప్రత్యేక పరిస్థితుల్లో సంభవించిన దుర్ఘటనగా అభివర్ణించిన కంపెనీ
  • పైలట్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన హెచ్ఏఎల్
  • విచారణ జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ
దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనపై హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్పందించింది. ఈ దుర్ఘటనలో పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మృతి చెందడం పట్ల కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో సంభవించిన దుర్ఘటనగా ఈ ప్రమాదాన్ని కంపెనీ అభివర్ణించింది.

ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని హెచ్ఏఎల్ హామీ ఇచ్చింది. అన్ని విధాలుగా సహకరిస్తామని, ఈ విషయంలో వాటాదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.

హెచ్ఏఎల్ తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయిన నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. కంపెనీ షేర్లు ఎనిమిది శాతానికి పైగా పడిపోయాయి.

ఈ ప్రమాదం తమ సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదని హెచ్ఏఎల్ పేర్కొంది. కంపెనీ ప్రకటన వెలువడిన తర్వాత హెచ్ఏఎల్ షేర్లకు కొంతమేర నష్టాలు తగ్గాయి. ఒక దశలో 8 శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 3.35 శాతం నష్టంతో రూ.4,440 వద్ద ముగిసింది.

కాగా, ఈ ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్‌కు చెందినది. సుమారు ఎనిమిది నిమిషాల విన్యాసాలు చేసిన అనంతరం ఈ విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.
Go Back to Shorts
HAL
Tejas fighter jet crash
Dubai Airshow
Hindustan Aeronautics Limited
Wing Commander Namansh Syal

More Telugu News