Devendra Fadnavis: ప్రశాంత్ కిశోర్‌ను ఉదహరిస్తూ ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Devendra Fadnavis Remarks on Prashant Kishor and Political Numbers
  • రాజకీయాల్లో సిద్ధాంతాల కన్నా సంఖ్యాబలమే ప్రధానం అన్న ఫడ్నవీస్
  • ప్రశాంత్ కిశోర్‌కు సిద్ధాంతం ఉంది కానీ సీట్లు రాలేదని వ్యాఖ్య
  • రాజకీయాల్లో ప్రాక్టికల్‌గా ఉండాలన్న ఫడ్నవీస్
రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే సంఖ్యా బలమే అంతిమంగా కీలకమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతాలు, సంఖ్యా బలం అనే రెండు మార్గాలు ఉంటాయని, కానీ నంబర్లు లేకుండా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ముంబైలో ఐఐఎంయూఎన్ నిర్వహించిన 'పరిపాలనలో యువత భాగస్వామ్యం' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎప్పుడూ ఆచరణాత్మకంగా (ప్రాక్టికల్‌గా) ఆలోచించాలన్నారు. ఉదాహరణకు, ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ మార్పు కోసం సిద్ధాంతాల గురించి చాలా మాట్లాడారని, కానీ ఆయన పార్టీకి సీట్లు రాలేదని గుర్తుచేశారు. సంఖ్యా బలం లేకపోవడం వల్లే ఇది జరిగిందని పరోక్షంగా సూచించారు.

ప్రభుత్వాలను నడిపించేటప్పుడు పార్టీల మధ్య సిద్ధాంతాలు సరిపోలకపోవచ్చని, కానీ 'కనీస ఉమ్మడి కార్యక్రమం' (కామన్ మినిమమ్ ప్రోగ్రాం) ద్వారా కలిసి పనిచేయగలమని తెలిపారు. భిన్న ధ్రువాలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడమే ప్రజాస్వామ్యంలోని అందం అని ఆయన అభివర్ణించారు. 90వ దశకంలో దేశంలో ప్రధానులు తరచుగా మారేవారని, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిణతి చెందిందన్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలు మరింత మెరుగుపడి, సిద్ధాంతాల ఆధారంగా నడిచే రోజులు తప్పక వస్తాయని, అయితే దానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
Devendra Fadnavis
Maharashtra politics
Prashant Kishor
Bihar elections
Political strategy
Coalition government
Common Minimum Program
Indian democracy
Political ideologies
Number game in politics

More Telugu News