Singareni: జీతాల కోసం అప్పులు.. ఆర్థిక సంక్షోభంలో సింగరేణి!

Singareni in Financial Crisis Taking Loans for Salaries
  • ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్‌పై ఆధారపడ్డ యాజమాన్యం
  • తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి పేరుకుపోయిన రూ.29 వేల కోట్ల బకాయిలు
  • తగ్గిన బొగ్గు డిమాండ్.. పడిపోయిన ఉత్పత్తి సామర్థ్యం
  • బకాయిలు చెల్లించాలంటూ సంస్థలకు సింగరేణి లేఖలు
ఒకప్పుడు నల్ల బంగారంతో లాభాల బాటలో పయనించిన సింగరేణి సంస్థ, నేడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సంస్థలో పనిచేస్తున్న 40,716 మంది ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించడానికి బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) పద్ధతిలో అప్పులు చేయాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

తెలంగాణ జెన్‌కో, డిస్కంలు సింగరేణి నుంచి కొనుగోలు చేస్తున్న బొగ్గు, విద్యుత్‌కు సంబంధించి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిల మొత్తం ఏకంగా రూ.29 వేల కోట్లకు చేరింది. ఇందులో జెన్‌కో నుంచి రూ.17 వేల కోట్లు, డిస్కంల నుంచి రూ.12 వేల కోట్లు రావాల్సి ఉంది. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం తాజాగా ఆ సంస్థలకు లేఖలు రాసింది. బయట సబ్సిడీ తీసుకుని బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని, బొగ్గు సరఫరా నిలిపివేయవద్దని జెన్‌కో కోరినట్లు సమాచారం.

అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మాత్రం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండటంతో సింగరేణి రోజువారీ కార్యకలాపాలను నెట్టుకొస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేయాలి. కానీ జెన్‌కో, డిస్కంలు, సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది.

బకాయిలతో పాటు సౌర, పవన విద్యుత్ వాడకం పెరగడంతో బొగ్గుకు డిమాండ్ తగ్గడం, కార్మికుల ఉత్పత్తి సామర్థ్యం పడిపోవడం వంటి అంశాలు కూడా సంస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ దశాబ్ద కాలంలో ప్రభుత్వపరంగా గతేడాది మార్చి నాటికి రూ.39,661.57 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.26 వేల కోట్ల బకాయిలు ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మరో రూ.13 వేల కోట్లకు పైగా బకాయిలు పెరిగాయని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Singareni
Singareni Collieries Company Limited
Telangana Genco
Discoms
Coal India
Financial Crisis
Debt
Coal
Power Sector
Telangana

More Telugu News