Ibomma Ravi: ‘మామా.. వచ్చా’.. ఒక్క మెసేజ్‌తో చిక్కిన ఐబొమ్మ రవి!

Iboma Ravi Arrested With Single Message
  • స్నేహితుడికి పంపిన మెసేజ్‌తో పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి
  • ఈ-మెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు
  • ఫ్రాన్స్ నుంచి రాగానే స్నేహితుడికి సమాచారం
  • దాంతో పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ పైరసీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు ఇమంది రవి.. తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్‌తో అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. మూడు నెలల పాటు నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ చిన్న ఆధారంతోనే రవిని పట్టుకోగలిగారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసును ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రవి డిజిటల్ అడుగుజాడలను అనుసరించారు. రవికి చెందిన ‘ఈఆర్ ఇన్ఫోటెక్‌’ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్‌ను పోలీసులు గుర్తించారు. ఆ డొమైన్‌కు లింక్ అయిన ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్‌లోని తన స్నేహితుడితో తరచూ మాట్లాడుతున్నట్లు కనిపెట్టారు.

ఎక్కువగా విదేశాల్లోనే ఉండే రవి, హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఆ స్నేహితుడిని కలుస్తుంటాడని తెలుసుకున్నారు. దీంతో ఆ స్నేహితుడి ఫోన్‌పై నిఘా పెట్టారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన రవి.. ‘మామా.. హైదరాబాద్ వచ్చా’ అని స్నేహితుడికి మెసేజ్ పెట్టాడు. ఈ సిగ్నల్ ఆధారంగా రవి నగరంలో ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు.. వెంటనే కూకట్‌పల్లిలోని ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఐదు రోజుల కస్టడీలో ఉన్న రవిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, విదేశాల్లోని సర్వర్లు, సిబ్బంది వివరాలపై పొంతనలేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. ఎప్పటికైనా దొరికిపోతానని ఊహించానని, కానీ ఇంత త్వరగా పట్టుబడతానని అనుకోలేదని రవి పోలీసులతో అన్నట్లు తెలిసింది.
Ibomma Ravi
Iboma
Imandi Ravi
cyber crime
piracy case
Hyderabad
Kukatpally
ER Infotech
France

More Telugu News