AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలపై సందిగ్ధత.. బీసీ రిజర్వేషన్లపైనే అసలు చిక్కుముడి

AP  Elections Uncertainty Over Local Body Polls Due to BC Reservations
  • వచ్చే మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదాపడే సూచనలు
  • సెప్టెంబరు-అక్టోబరులో పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం
  • బీసీ రిజర్వేషన్లను 34శాతానికి పెంచాలన్న హామీకి సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డంకి
  • బీసీ జనాభా గణన, రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు
  • చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీపరంగా బీసీలకు కోటా ఇచ్చే యోచనలో కూటమి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పరిషత్ ఎన్నికలు మాత్రం నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో జరిగే వీలుంది. ఈ జాప్యానికి, అనిశ్చితికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల ఖరారులో నెలకొన్న న్యాయపరమైన చిక్కులే.

బీసీ రిజర్వేషన్ల పెంపుపై చిక్కుముడి
గత ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుకు కట్టుబడి ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు నిబంధనలు దీనికి పెద్ద అడ్డంకిగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. దీనిని 34 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది. ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిమితిని దాటాలని ప్రయత్నించగా, సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది.

ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు తప్పనిసరిగా 'ట్రిపుల్ టెస్ట్' ఫార్ములాను అనుసరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు ఒక డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలి. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం వచ్చే నెలలో కమిషన్‌ను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, నివేదిక సమర్పించడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టొచ్చు.

ముందు పరీక్షలు.. ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!
ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి పంచాయతీ ఎన్నికల గడువు ముగిసిపోతుంది. మరోవైపు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనుండటంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఈ కారణాలతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, పరిషత్ ఎన్నికల పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరుతో ముగియనుండటంతో, ఆలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి సమయం సరిపోతుంది. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోతే, పార్టీపరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించడం ద్వారా వారిని సంతృప్తిపరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
AP Local Body Elections
Andhra Pradesh Elections
BC Reservations
Local Body Elections
Gram Panchayat Elections
MPT ZPTC Elections
Triple Test Formula
Supreme Court
Reservation Policy

More Telugu News