Nara Lokesh: 'నాసిన్' కేంద్రంలో ట్రైనీల ఇంటరాక్షన్ ప్రోగ్రామ్... ఉపరాష్ట్రపతితో కలిసి హాజరైన మంత్రి లోకేశ్

Nara Lokesh Attends Interaction Program at NACIN with Vice President
  • పాలసముద్రం నాసిన్ కేంద్రంలో ఉపరాష్ట్రపతి, మంత్రి లోకేశ్ పర్యటన
  • వికసిత్ భారత్ నిర్మాణంలో సివిల్ సర్వెంట్లదే కీలకపాత్రన్న ఉపరాష్ట్రపతి
  • పన్ను ఎగవేతదారులను కఠినంగా అరికట్టాలని అధికారులకు సూచన
  • జీఎస్టీని చరిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించిన సీపీ రాధాకృష్ణన్
  • బృంద స్ఫూర్తితో పనిచేయాలని యువ అధికారులకు దిశానిర్దేశం
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కేంద్రంలో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, 'వికసిత్ భారత్' నిర్మాణంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషించాలని, దేశాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

జీఎస్టీని ఒక చరిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించిన ఆయన, ఇది భారత పరోక్ష పన్నుల వ్యవస్థను ఎంతో సరళీకృతం చేసిందన్నారు. పన్ను ఎగవేతదారులను కఠినంగా అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సమాజ ప్రయోజనాల కోసం రూపొందించిన చట్టాలను కచ్చితంగా అమలు చేసినప్పుడే వాటి ఫలాలు ప్రజలకు అందుతాయని తెలిపారు. అధికారులు వ్యక్తిగత ప్రతిభ కంటే బృంద ప్రతిభకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమష్టి కృషితోనే గొప్ప లక్ష్యాలను సాధించగలమని అన్నారు.

నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి 'iGOT కర్మయోగి' ప్లాట్‌ఫాం ఒక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు. వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలని, నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యువ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024లో ఈ నాసిన్ ప్రాంగణాన్ని ప్రారంభించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. అప్పటి నుంచి ఈ కేంద్రం కస్టమ్స్, జీఎస్టీ పరిపాలనలో దేశంలోనే ఒక ప్రముఖ శిక్షణా సంస్థగా మారిందని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దార్శనిక నాయకుల వల్లే బలమైన, ఆత్మనిర్భర్ భారత్‌కు పునాదులు పడ్డాయని, వారి స్ఫూర్తితో అధికారులు ముందుకు సాగాలని అన్నారు.

అంతకుముందు నాసిన్ కేంద్రానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మంత్రి లోకేశ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి అమిత్ ఖరే, నాసిన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
NACIN
National Academy of Customs
Indirect Taxes
CP Radhakrishnan
GST
Civil Services
Andhra Pradesh
Sri Sathya Sai District
iGOT Karmayogi

More Telugu News