Smriti Mandhana: స్మృతి మంధన తండ్రికి గుండెపోటు... ఇవాళ జరగాల్సిన పెళ్లి వాయిదా

Smriti Mandhana Wedding Postponed After Father Suffers Heart Attack
  • భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన వివాహం వాయిదా
  • తండ్రి శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో పెళ్లి నిలిపివేత
  • సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహం
  • ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు
  • టోర్నీలో అత్యధిక పరుగులు చేసి కీలక పాత్ర పోషించిన స్మృతి
ఈ ఉదయం వరకు పెళ్లి వేడుకలతో ఎంతో ఉత్సాహభరితంగా ఉన్న భారత మహిళా క్రికెట్ స్టార్, ఓపెనర్ స్మృతి మంధన ఇంట విచారకర వాతావరణం నెలకొంది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ఇవాళ జరగాల్సిన ఆమె వివాహం వాయిదా పడింది. స్మృతి మంధన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం వీరి వివాహ వేడుక జరగాల్సి ఉండగా, ఈ అనూహ్య ఘటనతో వేడుకను నిలిపివేశారు.

ఇటీవలే ముగిసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలవడంలో స్మృతి మంధన కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నమెంట్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 434 పరుగులు చేసి, ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 

ఈ మెగా టోర్నీ అనంతరం వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని స్మృతి నిర్ణయించుకుంది. వరల్డ్ కప్ గెలిచిన మైదానంలో స్మృతికి ఆమె ప్రియుడు పలాస్ ముచ్చల్ కొన్ని రోజుల కిందటే ప్రపోజ్ చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి సంగీత్ కార్యక్రమం కూడా ఎంతో హుషారుగా సాగింది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధన గుండెపోటుకు గురవడంతో పెళ్లింట విచారం నెలకొంది.
Smriti Mandhana
Smriti Mandhana father
Srinivas Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
heart attack
ICC Womens World Cup 2025
Indian women cricket
cricket
Sangli

More Telugu News