Mohan Bhagwat: భారత్ ఒక హిందూ దేశం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Mohan Bhagwat says India is a Hindu nation
  • దండయాత్రల రోజులు పోయాయి, రామాలయంపై జెండా ఎగిరిందన్న భగవత్ 
  • భౌతిక సంపద పెరిగినా సమాజంలో నైతికత లోపించిందని వ్యాఖ్యలు
  • సమస్యలకు భగవద్గీతలోనే పరిష్కారం ఉందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్
  • లక్నోలో జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు
 భారత్ ఒక హిందూ సమాజమని, ఇది ఒక హిందూ దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆదివారం లక్నోలో జరిగిన 'దివ్య గీతా ప్రేరణ ఉత్సవ్' కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భగవద్గీత బోధనలు ప్రతీ యుగానికి, ప్రతీ పరిస్థితికి మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. "ప్రస్తుతం సమాజంలో భౌతిక సంపద పెరుగుతున్నప్పటికీ, శాంతి, నైతికత, సంతృప్తి కొరవడుతున్నాయి. దీనికి పరిష్కారం మన సనాతన జీవన విలువలలోనే ఉంది," అని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల నుంచి పారిపోకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీకృష్ణుడు గీతలో బోధించారని గుర్తు చేశారు.

భారతదేశ చరిత్రను ప్రస్తావిస్తూ, ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందిన మన దేశంపై శతాబ్దాల పాటు దండయాత్రలు జరిగాయని, ఆలయాలను ధ్వంసం చేసి బలవంతపు మతమార్పిడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. "అయితే, ఆ దండయాత్రల రోజులు ఇప్పుడు పోయాయి. మనం అయోధ్య రామమందిరంపై కాషాయ పతాకాన్ని ఎగురవేశాం," అని ఆయన అన్నారు. ఎన్ని అణచివేతలు ఎదురైనా దేశ సాంస్కృతిక గుర్తింపు చెక్కుచెదరలేదని తెలిపారు.

పౌరులందరూ ధర్మం, కర్తవ్యం, సేవ, త్యాగం వంటి విలువలను అలవరచుకోవాలని భగవత్ పిలుపునిచ్చారు. 1857 సిపాయిల తిరుగుబాటు అమరవీరులు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితకాలంలో విజయాన్ని చూడకపోయినా, వారి త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు.
Mohan Bhagwat
RSS
Rashtriya Swayamsevak Sangh
Hindu Rashtra
India Hindu nation
Divya Gita Prerana Utsav
Yogi Adityanath
Bhagavad Gita
Sanatana Dharma
Ayodhya Ram Mandir

More Telugu News