గచ్చిబౌలిలో రూ.14 కోట్ల భూమి కబ్జా.. సహకరించిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్
- నకిలీ జీపీఏ సృష్టించి భూమిని అమ్మేసిన కబ్జాదారుడు
- నిషేధిత భూముల జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్
- కబ్జాదారుడితో కలిసి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం
- యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
నకిలీ జీపీఏ..
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌కు చెందిన ఆర్వీ.రమణకుమార్(65)కు గచ్చిబౌలి టెలికామ్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీలోని సర్వే నం.91లో 700 చదరపు గజాల స్థలం ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.14 కోట్లు. 1987లో రమణకుమార్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఘజియాబాద్ లో ఉంటున్న రమణకుమార్ తరచుగా హైదరాబాద్ వచ్చి స్థలాన్ని చూసి వెళ్లేవాడు. ఇటీవల సదరు భూమిపై ఈసీ తీసుకోగా.. ఆ స్థలాన్ని చిట్టినీడి శేఖర్ బాబు అనే వ్యక్తి కొన్నట్లు రికార్డైంది. దీంతో ఆందోళన చెందిన రమణకుమార్ ఏంజరిగిందని ఆరా తీయగా.. కర్మన్‌ఘాట్‌కు చెందిన శ్రీకాంత్ చిగులూరి అనే వ్యక్తి నకిలీ జీపీఏ సృష్టించి తన స్థలాన్ని శేఖర్ బాబుకు అమ్మినట్లు బయటపడింది.
నిషేధిత జాబితాలో ఉన్నా..
రమణకుమార్ కు చెందిన ఈ 700 గజాల స్థలం నిషేధిత జాబితాలో ఉంది. అంటే, నిబంధనల ప్రకారం ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. అయినప్పటికీ రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఈ భూమిని శేఖర్ బాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రమణకుమార్ సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించగా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తోపాటు శ్రీకాంత్ చిగులూరి, చిట్టినీడి శేఖర్ బాబు సహా ఈ భూమి అమ్మకానికి సహకరించిన పలువురు ఇతర నిందితులపై కేసు నమోదు చేశారు.