Bhatti Vikramarka: అన్నపూర్ణ స్టూడియోను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Visits Annapurna Studios
  • స్టూడియోలోని సౌకర్యాలను భట్టికి వివరించిన నాగార్జున
  • తెలుగు సినిమా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్న భట్టి 
  • సినిమా, మీడియా రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తామని హామీ
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
 
 అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్న భట్టి విక్రమార్కకు నాగార్జున సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్టూడియో ఆవరణలో ఉన్న దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి భట్టి పూలమాల వేసి నివాళులర్పించారు. స్టూడియోలోని ఆధునిక సాంకేతిక వనరులు, ఫిల్మ్ స్కూల్‌లో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి నాగార్జున ఆయనకు వివరించారు.
 
 ఈ పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క స్టూడియోలో ప్రదర్శించిన ఓ లఘు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఫిల్మ్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా, మీడియా, డిజిటల్, ఇతర సృజనాత్మక రంగాల్లో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
 
Bhatti Vikramarka
Annapurna Studios
Akkineni Nagarjuna
Telugu Film Industry
Hyderabad
Telangana
Akkineni Nageswara Rao
Film School
Telangana Youth

More Telugu News