Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కొత్త చిక్కు.. 2 గంటలు దాటితే ఫైన్!

Hyderabad Metro Passengers Face Fine for Over 2 Hour Limit
  • మెట్రో స్టేషన్‌లో 120 నిమిషాల సమయ నిబంధన
  • సమయం దాటితే ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం
  • నిబంధనపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్న జనం
  • రైళ్ల ఆలస్యమే సమస్యకు కారణమంటున్న ప్రయాణికులు
  • సమయ పరిమితిని పెంచాలని అధికారులకు విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు కొత్త చిక్కును ఎదుర్కొంటున్నారు. తమ ప్రమేయం లేకుండానే అదనపు ఛార్జీల రూపంలో జరిమానాలు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు ప్రయాణికులకు 120 నిమిషాల (రెండు గంటలు) సమయ పరిమితి ఉండగా, ఈ నిబంధనపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు.

వివరాల్లోకి వెళితే... మెట్రో ప్రయాణికులు టికెట్ కొన్న 30 నిమిషాల్లోపు స్టేషన్‌లోకి ప్రవేశించి, ప్రయాణం ముగించుకుని 120 నిమిషాల్లోపు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ సమయం దాటితే అదనపు ఛార్జీని విధిస్తుంది. ఇటీవల ఓ వ్యక్తి రాయదుర్గంలో మెట్రో ఎక్కి, పరేడ్‌గ్రౌండ్‌లో దిగి, అక్కడి నుంచి జేబీఎస్‌కు నడిచి వెళ్లి మరో రైలెక్కి ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో దిగారు. అతని ప్రయాణ సమయం గంటన్నర మాత్రమే అయినా, వ్యవస్థలో మొత్తం గడిపిన సమయం రెండు గంటలు దాటడంతో అతనికి రూ.15 అదనపు ఛార్జీ పడింది.

ముఖ్యంగా కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్) మార్గంలో రైళ్ల ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా, ప్రతి 12 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తుండటంతో సమస్య తీవ్రంగా ఉంది. ఒక రైలు మిస్ అయితే, మరో రైలు కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోంది. ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లలో రైలు మారడానికి పట్టే సమయం కూడా దీనికి తోడవుతోంది. రైళ్ల ఆలస్యానికి తాము బాధ్యులం కానప్పుడు, ఆ భారాన్ని తమపై మోపడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు మెట్రో స్టేషన్లలో ఫుడ్ కోర్టులు, షాపింగ్ దుకాణాలు ఏర్పాటు చేసి, మళ్లీ సమయ పరిమితి విధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. షాపింగ్ లేదా భోజనం చేస్తే రెండు గంటల సమయం సులభంగా దాటిపోతుందని, కాబట్టి అధికారులు ఈ నిబంధనపై పునరాలోచించి సమయ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Hyderabad Metro
Metro Rail
Hyderabad
Metro charges
Metro time limit
JBS
MGBS
RTC Cross Roads
Parade Ground

More Telugu News