Guntur Police: గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు

Guntur Police Bust Cricket Betting Gang in Mangalagiri
  • మంగళగిరిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • ఐదుగురు నిందితుల నుంచి రూ. 6.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు
  • టెలిగ్రామ్ లింక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తింపు
  • నిందితులు 30 నకిలీ బ్యాంకు ఖాతాలు వాడారన్న పోలీసులు
గుంటూరు జిల్లాలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 6.30 లక్షల నగదు, 5 ల్యాప్‌టాప్‌లు, 32 మొబైల్ ఫోన్లు, 22 బ్యాంకు పాస్‌బుక్‌లు, 30 ఏటీఎం కార్డులు, 11 చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ అరెస్టు వివరాలను డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. తొలుత కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకోగా, బాలు, ప్రవీణ్, సూర్య పరారయ్యారని, వారిపై నిఘా పెట్టి తర్వాత అరెస్ట్ చేశామని వివరించారు.

ప్రధాన నిందితుడు మనోహర్‌కు ఆన్‌లైన్ గేమింగ్ అలవాటు ఉందని, టెలిగ్రామ్ ద్వారా వచ్చిన లింక్‌ను నమ్మి hublibook.com వెబ్‌సైట్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు ప్రారంభించాడని విచారణలో తేలింది. ఇతరుల ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు ఉపయోగించి మొత్తం 30 బ్యాంకు ఖాతాలను తెరిపించి, వాటి ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ కాస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి వీరు మోసాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఇందుకూరి బాలకృష్ణ రాజు, ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాశ్‌లను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. 
Guntur Police
Cricket Betting
Online Betting
Andhra Pradesh
Manoher
Illegal Activities
Cyber Crime
Hublibook
Betting Racket

More Telugu News