Dastagiri: జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటన.. జైలు అధికారులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం

Dastagiri Harassment Case Government Orders Action Against Jail Officials
  • వైద్య శిబిరం పేరుతో నిందితుడి కుమారుడికి జైలులోకి అనుమతి
  • ముగ్గురు అధికారులపై విచారణకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  • మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి, నాటి కడప జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నాటి సూపరింటెండెంట్ ఐఎన్‌హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.జవహర్‌బాబు, డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణాధికారిగా కోస్తాంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్‌ను, ప్రభుత్వ తరఫున ప్రెజెంటింగ్ అధికారిగా రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించారు. మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, మరో కేసులో భాగంగా 2023 అక్టోబరు 31న కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత నవంబరు 28న జైలులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ముసుగులో వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించారు. ఈ సమయంలోనే చైతన్యరెడ్డి.. దస్తగిరిని బెదిరించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం ఐఎన్‌హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో, జవహర్‌బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డాక్టర్ పుష్పలత కడప జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 
Dastagiri
YS Viveka case
Vivekananda Reddy murder case
Kadapa jail
Devireddy Sivashankar Reddy
Dr Chaitanya Reddy
INH Prakash
K Jawahar Babu
Dr G Pushpalatha

More Telugu News