Nara Lokesh: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Good News for Teachers No More Non Teaching Duties
  • ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
  • అభ్యసన ఫలితాల మెరుగుపైనే దృష్టి పెట్టాలని మంత్రి లోకేష్ సూచన
  • ఏపీటీఎఫ్ నేతలతో సమావేశమై సమస్యలు విన్న మంత్రి
  • పాత పెన్షన్, తెలుగు మీడియం కొనసాగింపుపై సంఘం వినతి
  • అన్ని డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ హామీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, వారికి ఎలాంటి బోధనేతర పనులు అప్పగించబోమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం)' మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేవీ ఉండవని హామీ ఇచ్చారు. డీఈఓ, ఎంఈఓలు కూడా కేవలం అభ్యసన ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించాలని, వారికి సర్వీస్ రూల్స్ వంటి బాధ్యతలు అప్పగించబోమని తేల్చిచెప్పారు. కడపలో విజయవంతమైన 'మోడల్ స్మార్ట్ కిచెన్ల'ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 17 నెలల్లో ఉపాధ్యాయ సంఘాలు తన దృష్టికి తెచ్చిన 423 సమస్యల్లో ఇప్పటికే 200 పరిష్కరించామని, మరికొన్ని పరిశీలనలో ఉన్నాయని వివరించారు.

మంత్రి ముందు ఏపీటీఎఫ్ డిమాండ్లు

ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ నేతలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా, 2011కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2003కు ముందు చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలని, మండలానికి కనీసం ఒక తెలుగు మీడియం పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని, ఎంఈఓలుగా ప్రధానోపాధ్యాయులనే నియమించాలని కోరారు. యాప్‌లలో వివరాలు అప్‌లోడ్ చేసే భారాన్ని తగ్గించాలని, ఉపాధ్యాయుల బదిలీల వల్ల ఖాళీ అయిన పోస్టుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. కేజీబీవీ టీచర్లకు టైమ్ స్కేల్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సరైన సర్వీస్ రూల్స్ రూపొందించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలని విన్నవించారు.

ఉపాధ్యాయ సంఘం నేతలు లేవనెత్తిన అన్ని అంశాలను సావధానంగా విన్న మంత్రి లోకేశ్, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యావ్యవస్థపై మంత్రి లోకేశ్ ఫోకస్.. విద్యార్థినుల కోసం 'కలలకు రెక్కలు' పథకం

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసి, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో కళాశాల, ఇంటర్, పాఠశాల విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో మూడు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినుల కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'కలలకు రెక్కలు' అనే నూతన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థినులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూత అందిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో, 88,196 మంది స్వదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఇదే సమావేశంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఆత్మహత్యల నివారణకు మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో విదేశీ, ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. ఆస్ట్రేలియాకు చెందిన పలు ప్రముఖ వర్సిటీలతో చేసుకున్న ఒప్పందాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విశాఖలో ఎడ్యుసిటీ, ప్రపంచస్థాయి ఏవియేషన్ యూనివర్సిటీతో పాటు అంతర్జాతీయ ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. 

రాజ్యాంగ దినోత్సవమైన ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులతో 'మాక్ అసెంబ్లీ' నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'బాలల భారత రాజ్యాంగం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.
Nara Lokesh
AP Teachers Federation
Teachers issues
Andhra Pradesh Education
Parent Teacher Meeting
Telugu Medium Schools
Old Pension Scheme
Kalaalaku Rekkalu Scheme
Education System
Student suicides

More Telugu News