Chandrababu Naidu: అధికారులకు భారీ టార్గెట్ నిర్దేశించిన సీఎం చంద్రబాబు... డీటెయిల్స్ ఇవిగో!

Chandrababu Naidu Sets Target for Housing Scheme in Andhra Pradesh
  • గృహనిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • రానున్న మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
  • ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల నిర్వహణ
  • వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం
  • ముస్లిం మైనార్టీలకు అదనంగా రూ. 50 వేల సాయం
  • ఎన్టీఆర్ హౌసింగ్ పెండింగ్ బిల్లులపై కేంద్రంతో చర్చించాలని సూచన
రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’ (హౌసింగ్ ఫర్ ఆల్) హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. రానున్న మూడేళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి, పేదలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో టిడ్కో, గృహనిర్మాణ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఎన్నికల్లో ఇచ్చిన ‘హౌసింగ్ ఫర్ ఆల్’ హామీని నెరవేర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించాం. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి 2029 జనవరి నాటికి పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం మొత్తం 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన 17 లక్షల ఇళ్లను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి. దీనిలో భాగంగా వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు జరగాలి" అని దిశానిర్దేశం చేశారు. 

ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా తీసుకోవాలని, త్వరలోనే టిడ్కో, గృహనిర్మాణ శాఖల సిబ్బందితోనూ సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.

ప్రజల సంతృప్తే ముఖ్యం

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని సీఎం స్పష్టం చేశారు. "ప్రస్తుతం జరుగుతున్న లబ్ధిదారుల సర్వేను వేగంగా పూర్తి చేసి, అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలి. ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి. లబ్ధిదారులు స్థలం కావాలని కోరితే కేటాయించండి... సొంత స్థలం ఉన్నవారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి. ప్రతి వివరమూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి" అని చంద్రబాబు ఆదేశించారు. 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY 1.0) కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇస్తున్న అదనపు సాయాన్ని ఇకపై ముస్లిం మైనార్టీలకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. దీని ద్వారా 18 వేల మంది ముస్లిం మైనార్టీ లబ్ధిదారులకు అదనంగా రూ. 50 వేల చొప్పున సాయం అందుతుందని, దీనికి రూ. 90 కోట్లు అవసరమవుతాయని వివరించారు.

పెండింగ్ బిల్లులపై కేంద్రంతో సంప్రదింపులు

గత ప్రభుత్వ కక్షసాధింపు చర్యల వల్ల 2014-19 మధ్య కాలంలో నిర్మించిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన రూ. 920 కోట్ల బిల్లులు నిలిచిపోయాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. "గత ప్రభుత్వం ఏ విధంగా ఈ బిల్లులను అడ్డుకుందో కేంద్రానికి వివరించి, వాటిని తిరిగి రాబట్టేందుకు సంప్రదింపులు జరపండి. గతంలో నరేగా పనులకు సంబంధించి ఆగిపోయిన బిల్లులను కూడా ఇదే తరహాలో తిరిగి వచ్చేలా చేశాం. అదే పద్ధతిలో ఈ హౌసింగ్ బిల్లులను కూడా సాధించాలి" అని అధికారులను ఆదేశించారు.

2014-19 మధ్య 8 లక్షల ఇళ్లు, 2019-24 మధ్య 5.80 లక్షల ఇళ్లు నిర్మించినట్లు అధికారులు ఈ సమావేశంలో వివరించారు. ఈ సమీక్షలో గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు టిడ్కో, హౌసింగ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh Housing
Housing for All
TIDCO houses
AP Housing Scheme
PMAY 1.0
NTR Rural Housing Scheme
Andhra Pradesh government
Affordable Housing

More Telugu News