Jagan Mohan Reddy: కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి: సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ

Jagan wrote Chandrababu on Krishna River Water Rights
  • ఏపీ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి
  • ట్రైబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనలు బలహీనంగా ఉన్నాయని విమర్శ
  • తెలంగాణ డిమాండ్లు, ఆల్మట్టి ఎత్తు పెంపుపై తీవ్ర ఆందోళన
  • ఒక్క టీఎంసీ నీరు తగ్గినా టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరిక
కృష్ణా నదీ జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ముందు త్వరలో జరగనున్న విచారణలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని తమ రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ట్రైబ్యునల్ ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన తుది వాదనలను బలంగా వినిపించి, ఏపీకి జరగబోయే నష్టాన్ని నివారించాలని సూచించారు.

ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడటంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని జగన్ ఆరోపించారు. "ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు బలహీనమైన వాదనలు వినిపిస్తోంది. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉంది" అని లేఖలో పేర్కొన్నారు.

ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.16 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు అవసరమైన భూసేకరణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఖరి సరిగా లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలు ఏపీకి నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నాయని విమర్శించారు.

1996లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే పనులు మొదలయ్యాయని, అప్పుడు రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆల్మట్టి ఎత్తు పెంపునకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చిందని, 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని ఆరోపించారు.

"ఈ కీలక తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాలపై మన హక్కులను కాపాడాలి. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో ఒక్క టీఎంసీ తగ్గినా, అందుకు టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని జగన్ తన లేఖలో స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
Krishna River
Krishna River Water Dispute
Chandrababu Naidu
Andhra Pradesh
Telangana
KWDT-II
Almatti Dam
Rayalaseema Projects
Water Rights

More Telugu News