Sania Mirza: అలాంటి వాళ్లను చూస్తే నాకు జాలి కలిగేది: సానియా మీర్జా

Sania Mirza feels pity for critics
  • సోషల్ మీడియాను పట్టించుకోవద్దని రిచా ఘోష్‌కు సానియా మీర్జా సూచన
  • బెంగళూరు టెక్ సమ్మిట్‌లో తన అనుభవాలను పంచుకున్న టెన్నిస్ స్టార్
  • రాకెట్ పట్టుకోని వారు కూడా విమర్శించేవారని విమర్శ
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోవద్దని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భారత మహిళల జట్టు యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు సూచించింది. దాని ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలని, అనవసర ప్రాధాన్యం ఇవ్వకూడదని హితవు పలికింది. బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 2025లో పాల్గొన్న ఆమె, తన క్రీడా జీవితంలోని అనుభవాలను పంచుకుంది.

ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. "రిచా ఘోష్‌ యువ క్రీడాకారిణి. ఈ తరం సోషల్ మీడియాను, ఎలక్ట్రానిక్‌ మీడియాను చూస్తోంది. మా రోజుల్లో కేవలం వార్తాపత్రికలే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎలక్ట్రానిక్‌ మీడియా వచ్చాక క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెరిగింది. ముందురోజు డిన్నర్‌కు వెళ్లడం వల్లే మ్యాచ్ ఓడిపోయారంటూ కథనాలు రాసేవారు. ఇలాంటివి చూస్తే నాకు నవ్వొచ్చేది" అని పేర్కొంది.

టెన్నిస్ రాకెట్‌ ఎప్పుడూ చేత్తో పట్టుకోని వారు కూడా తన ఆట గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించేదని సానియా గుర్తుచేసుకుంది. "అలాంటి వాళ్లను చూస్తే నాకు జాలి కలిగేది. జీవితంలో సంతోషంగా లేనివారే, దేశానికి ప్రాతినిధ్యం వహించే వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. వచ్చే ప్రశంసలను గానీ, విమర్శలను గానీ మనసులోకి తీసుకోకూడదు. సోషల్ మీడియా మనల్ని నియంత్రించకుండా చూసుకోవాలి" అని సానియా వివరించింది. ఒకప్పుడు మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆమె పేర్కొంది.
Sania Mirza
Richa Ghosh
Indian Tennis Star
Social Media Criticism
Electronic Media
Womens Cricket
Bengaluru Tech Summit 2025
Sports News

More Telugu News