Mamata Banerjee: ఈసీకి మమతా బెనర్జీ లేఖ.. 'ఎక్స్' వేదికగా కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

Mamata Banerjee Letter to EC Amit Shah Counters on X
  • ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ సీఈసీకి మమతా బెనర్జీ లేఖ
  • ఎవరి పేరును, పార్టీని ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చిన అమిత్ షా
  • కొన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శ
దేశంలోకి వచ్చే చొరబాటుదారులను కొన్ని రాజకీయ పార్టీలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై మమతా బెనర్జీ సీఈసీ జ్ఞానేశ్వర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో అమిత్ షా 'ఎక్స్' వేదికగా ఈ విధంగా స్పందించారు.

కొన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు చొరబాటుదారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారులను అడ్డుకోవడం దేశ భద్రతకు ఎంతో కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చొరబాట్లను నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అయితే, ఆయన నేరుగా మమతా బెనర్జీ పేరును ప్రస్తావించలేదు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని విపక్షాల నుంచి డిమాండ్లు వస్తోన్న విషయం తెలిసిందే. ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సీఈసీకి లేఖ రాశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బెంగాల్‌లో అరాచకంగా, బలవంతంగా, ప్రమాదకరంగా సాగుతోందని ఆమె ఆరోపించారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన సమాచారం లేకుండానే ఎస్ఐఆర్ రుద్దుతున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్‌లో పాల్గొంటున్న అధికారులు అసాధారణ పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు.
Mamata Banerjee
Amit Shah
West Bengal
Election Commission of India
Infiltration
Voter list

More Telugu News