Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu offers prayers at Tirumala temple
  • ఆలయ సంప్రదాయాల ప్రకారం రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన టీటీడీ
  • వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించిన రాష్ట్రపతి
  • హైదరాబాద్, పుట్టపర్తి కార్యక్రమాలలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె, తిరుమల సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ భూ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం రాష్ట్రపతి గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర‌ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, 2026 టీటీడీ క్యాలెండర్, డైరీలను అందజేశారు.

గురువారమే తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి, మొదట తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ 2025ను ఆమె ప్రారంభించనున్నారు. రేపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలలో ఆమె పాల్గొంటారు.
Droupadi Murmu
President of India
Tirumala
Sri Venkateswara Swamy
TTD
Tirupati
Sri Padmavathi Ammavari Temple
Sri Sathya Sai Baba
Puttaparthi
Andhra Pradesh

More Telugu News