TTD: అవినీతికి అడ్డుకట్ట.. టీటీడీలో కొత్త బదిలీల విధానం

TTD New Transfer Policy to Curb Corruption in Marketing Department
  • టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రక్షాళనకు ధర్మకర్తల మండలి నిర్ణయం
  • అవినీతి ఆరోపణల నేపథ్యంలో కఠిన నిబంధనల అమలుకు సిద్ధం
  • విభాగంలో రెండేళ్లకు మించి సిబ్బంది ఉండకుండా బదిలీ రూల్
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి సరుకుల కొనుగోలుకు ప్రణాళిక
  • శాలువాలు వంటివి నేరుగా స్థానికంగా కొనుగోలు చేసే యోచన
టీటీడీ అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారిన మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ధర్మకర్తల మండలి నడుం బిగించింది. ఏటా సుమారు రూ. 700 కోట్లకు పైగా కొనుగోళ్లు జరిపే ఈ కీలక విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠ‌మైన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది.

గతంలో ఈ విభాగంలో జరిగిన అవకతవకలు, నాణ్యతలేని సరుకుల కొనుగోళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రూ. 350 విలువ చేసే శాలువాలను రూ. 1,300కు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికే కొందరు సిబ్బందిని బదిలీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రెండేళ్లకు మించి ఒకేచోట వద్దు..
ఇందులో భాగంగా మార్కెటింగ్ విభాగంలో ఏ అధికారి లేదా సిబ్బంది అయినా రెండేళ్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. రెండేళ్ల తర్వాత తప్పనిసరిగా వారిని బదిలీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ విభాగంలోకి ఎవరినైనా నియమించే ముందు వారి గత పనితీరు, అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ నివేదిక తీసుకోవాలనే నిబంధన పెట్టారు.

కొనుగోళ్ల ప్రక్రియలోనూ మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు 10-15 రోజులకోసారి హడావుడిగా సరుకులు కొనుగోలు చేస్తుండగా, ఇకపై మూడు నెలలకు ఒకసారి టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సరుకుల నిల్వ కోసం గోదాములను సిద్ధం చేసుకోవాలని బోర్డు అధికారులకు సూచించింది. అలాగే శాలువాల వంటివి మంగళగిరి వంటి స్థానిక ప్రాంతాల నుంచి నేరుగా కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలను త్వరలోనే అమలు చేసి, మార్కెటింగ్ విభాగంలో పారదర్శకత తీసుకురావాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది.
TTD
TTD corruption
Tirumala Tirupati Devasthanams
TTD marketing department
TTD transfers
TTD vigilance
BR Naidu
Tirupati
Andhra Pradesh
TTD board decisions

More Telugu News