Javed Ahmad Siddiqui: అల్ ఫలాహ్‌ వర్సిటీ వ్యవస్థాపకుడిపై మరో ఫ్రాడ్ కేసు.. టెర్రర్ ఫండింగ్‌తో సంబంధాలు

Al Falah University Founder Javed Ahmad Siddiqui in More Trouble
  • టెర్రర్ ఫండింగ్ కేసులో అల్ ఫలాహ్‌ వర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అరెస్ట్
  • నకిలీ అక్రిడిటేషన్‌తో రూ.415 కోట్లు వసూలు చేశారని ఈడీ ఆరోపణ
  • తాజాగా భోపాల్‌లో రూ.2 కోట్ల మోసం కేసు నమోదు
  • 24 ఏళ్ల నాటి చిట్ ఫండ్ కేసులోనూ నిందితుడిగా సిద్ధిఖీ
  • డిసెంబర్ 1 వరకు ఈడీ కస్టడీకి జావేద్ సిద్ధిఖీ
టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే 13 రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఆయనపై తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.2 కోట్ల మోసం కేసు నమోదైంది. దీంతో ఆయన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

వర్సిటీకి నకిలీ అక్రిడిటేషన్లు ఉన్నాయని, చట్టబద్ధమైన గుర్తింపు పొందినట్లు తప్పుడు ప్రచారాలు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసగించారని సిద్ధిఖీపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసం ద్వారా ఆయన సుమారు రూ.415.10 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ బ్లాస్ట్ కేసుతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఆదివారం సిద్ధిఖీని అరెస్ట్ చేసి, డిసెంబర్ 1 వరకు కస్టడీకి తీసుకుంది.

ఇక‌, భోపాల్‌లో నమోదైన కొత్త కేసు 24 ఏళ్ల నాటిది. 1997-2001 మధ్య కాలంలో సిద్ధిఖీ, అతని సోదరుడు హమూద్ సిద్ధిఖీ ఒక చిట్ ఫండ్ కంపెనీని నడిపి, డబ్బు రెట్టింపు చేస్తామని ప్రజల నుంచి భారీగా వసూలు చేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు. గ్యాస్ బాధితులకు చెందిన నిధులతో కూడా ఉడాయించారని ఆరోపణలున్నాయి. పాత కేసులో సిద్ధిఖీ ముందస్తు బెయిల్ పొందగా, ఆయన సోదరుడు నిర్దోషిగా విడుదలయ్యారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లోని మో కంటోన్మెంట్ బోర్డు అధికారులు సిద్ధిఖీ పూర్వీకుల ఇంటికి నోటీసులు జారీ చేశారు. ఆ ఇంటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని తొలగించాలని నోటీసులో ఆదేశించారు. దర్యాప్తు సమయంలో యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్లు, ఫీజుల రికార్డులను సిద్ధిఖీ మార్చే అవకాశం ఉందని ఈడీ కోర్టులో వాదించింది.
Javed Ahmad Siddiqui
Al Falah University
Terror Funding
Money Laundering
ED Investigation
Fraud Case
Bhopal
Madhya Pradesh

More Telugu News