YV Subba Reddy: తిరుమలలో కల్తీ నెయ్యి కేసు... వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లో ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

YV Subba Reddy Questioned at Hyderabad Residence by SIT
  • కల్తీ నెయ్యి కేసులో వేగవంతమైన దర్యాప్తు
  • టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్న సిట్
  • విజయవాడకు రాలేననడంతో హైదరాబాద్‌లోనే ప్రశ్నలు
  • పీఏ అప్పన్న ఇచ్చిన సమాచారంతో సుబ్బారెడ్డి విచారణ
  • నెయ్యి సరఫరా ఒప్పందాలపై అధికారులు ఆరా
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది.

తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు విజయవాడ నుంచి నోటీసులు జారీ చేశారు. అయితే, తాను అక్కడికి రాలేనని ఆయన సమాధానం ఇవ్వడంతో, సిట్ అధికారులే నేరుగా హైదరాబాద్ కు వచ్చి ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు వివరాలు రాబడుతున్నట్లు సమాచారం.

ఇదే కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ఆయన నుంచి పలు కీలక విషయాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు సుబ్బారెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ తర్వాత కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆసక్తి నెలకొంది.
YV Subba Reddy
Tirumala
TTD
SriVari Laddu
Adulterated Ghee
SIT Investigation
Andhra Pradesh
YSRCP
Appanna
Tirupati

More Telugu News