TTD: విరాళాల పేరిట మోసం.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

TTD Chairman Warns Against Fraudulent Donation Appeals
  • మోసపూరిత సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు టీటీడీ సూచన
  • గ్లోబల్ హిందూ హెరిటేజ్, సేవ్ టెంపుల్స్ సంస్థలపై ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపణలు
  • తప్పుడు ప్రచారంతో విరాళాలు సేకరిస్తున్నాయని వెల్లడి
  • అనుమానాస్పద సంస్థల వలలో పడొద్దని భక్తులకు విజ్ఞప్తి
భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న కొన్ని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (Global Hindu Heritage Foundation), సేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గనైజేషన్ (savetemples.org) వంటి సంస్థలు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ విరాళాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నాయుడు పేర్కొన్నారు. ఈ నెల‌ 29న తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

ఇలాంటి అనుమానాస్పద సంస్థలు చేసే ప్రచారాలను నమ్మవద్దని, వారి వలలో పడి విరాళాలు ఇచ్చి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు. భక్తులు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి మోసపూరిత చర్యలను తిప్పికొట్టాలని టీటీడీ ఛైర్మన్ కోరారు.
TTD
BR Karunakar Reddy
Tirumala
Global Hindu Heritage Foundation
Save Temples Org
Donations
Fraud
Tirupati
Pilgrims

More Telugu News