Jagan Mohan Reddy: నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ... సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్

Jagan went to Lotus Pond after hearing in CBI Court
  • అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
  • ఏ1గా పిలవగానే కోర్టు హాల్లోకి వెళ్లి సంతకం చేసిన వైనం
  • విచారణ అనంతరం లోటస్ పాండ్ నివాసానికి తిరుగుపయనం
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే, కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిలిచారు. వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి, న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం, న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్‌ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణనలోకి తీసుకుని, సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది.

కాగా, ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్, నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసమైన లోటస్ పాండ్‌కు వెళ్లారు. లోటస్ పాండ్ వద్దకు అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. లోటస్ పాండ్ లోకి కేవలం కొద్ది మంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు. వీరితో జగన్ గంటన్నర పాటు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా జగన్ ను కలవనున్నారు. హైదరాబాద్ నుంచి జగన్ బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, మీడియాతో జగన్ మాట్లాడతారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Jagan Mohan Reddy
YS Jagan
CBI Court
Illegal Assets Case
Lotus Pond
Andhra Pradesh Politics
YSRCP
Nampally CBI Court
Hyderabad News
Political News

More Telugu News