Viral Video: పాక్ బౌలర్‌తో హర్భజన్ కరచాలనం.. ఉద్రిక్తతల మధ్య ఆసక్తికర ఘటన

Harbhajan Singh shakes hands with Pakistan bowler in Abu Dhabi T10 league
  • అబుదాబి టీ10 లీగ్‌లో పాక్ బౌలర్‌తో హర్భజన్ కరచాలనం
  • పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు
  • గత కొంతకాలంగా పాక్‌తో కరచాలనానికి దూరంగా భారత జట్లు
  • కొన్ని నెలల క్రితం పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన హర్భజన్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ బౌలర్ షాహనవాజ్ దహానీతో కరచాలనం చేయడం క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పిన్ స్టాలియన్స్, నార్తర్న్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం స్టాలియన్స్ కెప్టెన్ అయిన హర్భజన్, దహానీతో స్నేహపూర్వకంగా మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

ఈ ఏడాది పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ జట్లు (సీనియర్ పురుషులు, మహిళలతో సహా) పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి దూరంగా ఉంటున్నాయి. ఆసియా కప్, మహిళల ప్రపంచకప్ వంటి టోర్నీలలోనూ ఇదే ధోరణి కనిపించింది.

ఇక‌, హర్భజన్ సింగ్ కొన్ని నెలల క్రితం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. శిఖర్ ధావన్, పఠాన్ సోదరులు, సురేశ్ రైనాలతో కలిసి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరించారు. "రక్తం, చెమట ఒకేచోట కలిసి ఉండలేవు" అని వారు అప్పట్లో వ్యాఖ్యానించారు. వారి బాయ్‌కాట్‌తో ఇండియా ఛాంపియన్స్ మ్యాచ్‌ను కోల్పోగా, పాకిస్థాన్ ఫైనల్‌కు వెళ్లింది.

నిన్న‌ జరిగిన ఈ టీ10 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే, ఆస్పిన్ స్టాలియన్స్‌పై నార్తర్న్ వారియర్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దహానీ కేవలం 10 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. కెప్టెన్ హర్భజన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి 8 పరుగులు ఇవ్వగా, బ్యాటింగ్‌లో ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు.
Viral Video
Harbhajan Singh
Shahnavaz Dahani
T10 League
India Pakistan relations
Abu Dhabi
Cricket
Aspen Stallions
Northern Warriors
Pahalgam attack
Sports

More Telugu News