Pratyusha: సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో వీడనున్న ఉత్కంఠ.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Pratyusha death case Supreme Court reserves verdict
  • రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన
  • జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్
  • శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి పిటిషన్
రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌పైనా, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేసిన పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. జస్టిస్‌ రాజేశ్‌ బిందల్, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ పురుగుమందు తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో (సెక్షన్ 306) సిద్ధార్థ రెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఈ కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, 2011లో ఉన్నత న్యాయస్థానం శిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను రూ. 50 వేలకు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.

సుప్రీంకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినందుకు నిందితుడికి గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు. అయితే, నిందితుడి తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఇద్దరూ కలిసే విషం తాగారని, కాబట్టి ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
Pratyusha
Pratyusha case
Siddhartha Reddy
actress Pratyusha
suicide case
Supreme Court
Sarojini Devi
CBI investigation
Hyderabad
Telugu states

More Telugu News