Imandi Ravi: ఐబొమ్మ రవికి మరో షాక్... పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు

Police Custody for iBomma Ravi in Piracy Case
  • ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
  • కస్టడీ పిటిషన్‌కు ఆమోదం తెలిపిన నాంపల్లి కోర్టు
  • పైరసీ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్న రవి
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ పైరసీ కేసులో అరెస్ట్ అయిన అతడిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఐదు రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. దీంతో పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో ఇమంది రవిని గత శనివారం కూకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్లుగా ఐ బొమ్మతో పాటు బప్పం, ఐ విన్, ఐ రాధ టీవీ వంటి పేర్లతో పలు వెబ్‌సైట్లను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

రవి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులు జరిపిన సోదాల్లో రూ.3 కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తరలించి విచారించారు. తాజాగా కోర్టులో హాజరుపరచగా, కస్టడీకి అనుమతి లభించింది.
Imandi Ravi
iBomma
iBomma Ravi
Piracy Website
Cyber Crime
Hyderabad Cyber Crime Police
Telugu Movies
OTT Content
Movie Piracy
Nampally Court

More Telugu News