Asaduddin Owaisi: ఆత్మాహుతి దాడి అమరత్వం కాదు, ఘోర పాపం: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi Condemns Suicide Attacks as Sin Not Martyrdom
  • ఢిల్లీ పేలుళ్ల నిందితుడి వీడియోపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
  • ఇస్లాంలో ఆత్మాహుతి, అమాయకుల హత్య నిషిద్ధమని స్పష్టీకరణ
  • కొత్త ఉగ్రవాద ముఠాపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన ఒవైసీ
ఆత్మాహుతి దాడిని "అమరత్వం"గా అభివర్ణిస్తూ ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ ఉన్-నబీ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మాహుతి (ఆత్మహత్య) 'హరామ్' (నిషిద్ధం) అని, అమాయకులను చంపడం ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఉగ్రవాదమే తప్ప మరేమీ కాదని తేల్చి చెప్పారు.

ఈ మేరకు ఒవైసీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ నబీ ఆత్మాహుతి దాడిని సమర్థిస్తున్న పాత వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధం, అమాయకులను చంపడం మహా పాపం. ఇవి దేశ చట్టాలకు కూడా విరుద్ధం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇది కచ్చితంగా ఉగ్రవాదమే" అని పేర్కొన్నారు.

అదే సమయంలో, దేశ రాజధాని సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు దొరకడం, కొత్త ఉగ్రవాద ముఠా వెలుగు చూడటంపై ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "గత ఆరు నెలల్లో కశ్మీర్‌లో స్థానికంగా ఎవరూ ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు హామీ ఇచ్చారు. మరి ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని నిలదీశారు.

ఇటీవల వైరల్ అయిన వీడియోలో, వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఉమర్, ఆత్మాహుతి దాడిని 'షహీద్ ఆపరేషన్' (అమరవీరుల చర్య)గా అభివర్ణించాడు. అయితే, అతని వాదనను పలువురు ముస్లిం ప్రముఖులు కూడా ఖండిస్తున్నారు. జమ్మూకశ్మీర్ విద్యార్థి సంఘం జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుహెమీ మాట్లాడుతూ.. "ఇస్లాంలో ఆత్మహత్యే హరామ్ అయినప్పుడు, ఆత్మాహుతి దాడి అంతకంటే పెద్ద పాపం. ఇస్లామిక్ బోధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి అనుమతించవు" అని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi
Delhi Bombings
Umar un Nabi
Suicide Attack
Islam Haram
Terrorism
Amit Shah
Kashmir
Nasir Khuehami
Islamic Teachings

More Telugu News