Nara Lokesh: పుట్టపర్తిలో సచిన్ టెండూల్కర్ ను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Meets Sachin Tendulkar in Puttaparthi
  • రేపు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు
  • పుట్టపర్తి చేరుకున్న సచిన్, మంత్రి నారా లోకేశ్ తదితరులు
  • సచిన్ తో పలు అంశాలపై చర్చించిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సచిన్‌ను కలవడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ భేటీలో క్రికెట్, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి, శ్రీ సత్యసాయి బాబా బోధనలు వంటి పలు అంశాలపై చర్చ జరిగిందని వివరించారు.

ఈ సందర్భంగా క్రికెట్ ఆటలో కాలక్రమేణా వచ్చిన మార్పులు, సచిన్ అద్భుతమైన కెరీర్‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇరువురూ పంచుకున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలను, ముఖ్యంగా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సచిన్‌కు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రస్తావించినట్టు తెలిపారు.

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన జీవితం, బోధనలు, మానవాళికి ఆయన అందించిన నిస్వార్థ సేవ గురించి కూడా తాము మాట్లాడుకున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

రేపు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం కోసం నారా లోకేశ్ కూడా పుట్టపర్తి చేరుకున్నారు. సచిన్ కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరాధకుడు కావడంతో, ఆయన కూడా పుట్టపర్తి విచ్చేశాడు. ఈ క్రమంలోనే సచిన్ ను నారా లోకేశ్ కలిశారు. లోకేశ్ వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు.
Nara Lokesh
Sachin Tendulkar
Andhra Pradesh
Puttaparthi
Sathya Sai Baba
AP Minister
Cricket
Sports Development
Chandrababu Naidu
Narendra Modi

More Telugu News