Chandrababu Naidu: రేపు సత్యసాయి, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu to Visit Sathya Sai Kadapa Districts Tomorrow
  • రేపు శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • పుట్టపర్తిలో ప్రధాని మోదీతో కలిసి సత్యసాయి శత జయంతి వేడుకలకు హాజరు
  • కడప జిల్లా నుంచి 'అన్నదాత సుఖీభవ' రెండో విడత నిధుల విడుదల
  • 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు జమ
  • రైతులతో ముఖాముఖి, స్థానిక కేడర్‌తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (నవంబరు 19) శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుట్టపర్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననుండగా, కడప జిల్లాలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.

సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రమే హైదరాబాద్ నుంచి నేరుగా పుట్టపర్తికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9:25 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వాగతం పలుకుతారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రధానితో కలిసి సాయి కుల్వంత్ హాల్‌లోని భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శత జయంతి ఉత్సవాల్లో ఇరువురు నేతలు పాల్గొంటారు.

ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం, మధ్యాహ్నం 1:15 గంటలకు ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి చేరుకుని అక్కడ 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేసి, అనంతరం ప్రసంగిస్తారు.

ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 7,000 చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన తొలి విడతగా అర్హులైన రైతులకు రూ. 7,000 చొప్పున ప్రభుత్వం అందించింది. తాజా విడతతో కలిపి ఈ పథకం ద్వారా రెండు విడతల్లో రైతులకు మొత్తం రూ. 6,309.44 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.

పెండ్లిమర్రిలో నిధుల విడుదల కార్యక్రమానికి ముందు సీఎం స్థానిక గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక పార్టీ కేడర్‌తో సమావేశమై, రాత్రికి అమరావతికి తిరిగి రానున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Sathya Sai
PM Kisan
Narendra Modi
Kadapa
Annadata Sukhibhava
Farmers Welfare
AP Politics
Sathya Sai Baba Birth Centenary

More Telugu News