Nadendla Manohar: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Record Paddy Procurement Farmers Get 560 Cr in 24 Hours
  • రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
  • ఇప్పటివరకు 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ
  • వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయించే సరికొత్త సౌకర్యం
  • తుపాను నేపథ్యంలో రైతులకు ఉచితంగా టార్పాలిన్ల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం నాటికి 32,793 మంది రైతుల నుంచి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, వారి ఖాతాల్లో రూ.560.48 కోట్లను జమ చేశామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం అధికమని ఆయన వెల్లడించారు. విజయవాడ రూరల్ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల పురోగతిని వివరించారు.

రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ, నిజాయతీగా కొనుగోళ్లు జరుపుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో దాదాపు 16,000 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1,81,885 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, ఈసారి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్లే కొనుగోళ్లు పెరిగాయని అన్నారు. ధాన్యం అమ్మిన వారిలో చిన్న, సన్నకారు రైతులతో పాటు 6,600 మంది కౌలు రైతులు కూడా ఉన్నారని వివరించారు.

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ ప్రక్రియను ఒక సవాలుగా తీసుకుని, దేశంలోనే తొలిసారిగా 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని గర్వంగా చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాటి సుబ్బారావు అనే రైతు ఖాతాలో 6 గంటల్లోనే రూ.2.08 లక్షలు, ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన నీలం త్రిమూర్తులు ఖాతాలో 5 గంటల్లోనే డబ్బులు జమ చేశామని ఉదాహరణగా పేర్కొన్నారు.

సాంకేతికతను వినియోగిస్తూ రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా రైతులు తమ ధాన్యాన్ని ఏ రోజు, ఏ మిల్లుకు అమ్మాలో వారే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. 73373 59375 నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపితే, షెడ్యూల్ వివరాలు వాట్సాప్‌లోనే వస్తాయని, ఇప్పటివరకు 500 మంది రైతులు ఈ సేవలను వినియోగించుకున్నారని వివరించారు.

రానున్న అల్పపీడన తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల్లో 50 వేల టార్పాలిన్లను అందుబాటులో ఉంచామని, ఇప్పటికే 19 వేల టార్పాలిన్లను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. గోనె సంచుల కొరత లేకుండా 6.34 కోట్ల గోతాలను సిద్ధం చేశామన్నారు. ఈ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ ఎస్. ఢిల్లీ రావు కూడా పాల్గొన్నారు.
Nadendla Manohar
Paddy procurement
Andhra Pradesh
Farmers welfare
Civil Supplies Department
Chandrababu Naidu
Pawan Kalyan
Rythu Bharosa Kendram
Guntur
Eluru

More Telugu News