Madvi Hidma: ఇటీవలే హిడ్మా తల్లితో కలిసి భోజనం చేసిన ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం... 8 రోజులకే ఎన్‌కౌంటర్

Madvi Hidma Encounter Chhattisgarh Deputy CM Met Hidmas Mother 8 Days Before
  • హిడ్మా తల్లితో ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం భేటీ
  • లొంగిపోవాలని చర్చలు జరిపిన 8 రోజులకే ఎన్‌కౌంటర్
  • భద్రతా బలగాల కాల్పుల్లో హిడ్మా హతం
  • హిడ్మా భార్య రాజే సహా మరో నలుగురు మావోయిస్టుల మృతి
  • ఆపరేషన్ వివరాలు వెల్లడించిన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్
మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మా ఏపీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ ల మరణించడం తెలిసిందే. ఇటీవల హిడ్మాను లొంగిపోవాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్వయంగా ఆయన తల్లితో కలిసి భోజనం చేసిన సరిగ్గా 8 రోజులకే, భద్రతా బలగాల చేతిలో హిడ్మా హతమయ్యాడు. మావోయిస్టు ఉద్యమానికి ఇది గట్టి ఎదురుదెబ్బ.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:30 నుంచి 7:00 గంటల మధ్య భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, సెంట్రల్ కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు గన్‌మన్‌లు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్డా మీడియాకు వెల్లడించారు.

ఈ ఎన్‌కౌంటర్‌కు కేవలం 8 రోజుల ముందు, అంటే నవంబర్ 10న, ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మావోయిస్టుల కంచుకోట అయిన సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామానికి భారీ బందోబస్తు నడుమ వెళ్లారు. అక్కడ హిడ్మా తల్లిని కలిసి, ఆమెతో కలిసి భోజనం చేశారు. తన కుమారుడిని లొంగిపోయేలా ఒప్పించాలని ఆయన ఆమెను అభ్యర్థించారు. ఇందుకు హిడ్మా తల్లి కూడా సానుకూలంగా స్పందించి, తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు నిఘా వర్గాలు హిడ్మా కదలికలపై కన్నేసి ఉంచాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో, హిడ్మాతో సహా పలువురు అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి ఇక్కడ ఉద్యమాన్ని పునరుద్ధరించాలని చూస్తున్నట్లు తమకు పక్కా సమాచారం అందిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. గత రెండు రోజులుగా అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించామని, ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తామని వెల్లడించారు.
Madvi Hidma
Hidma
Chhattisgarh
Vijay Sharma
Maoist
encounter
Sukma
Andhra Pradesh
Naxal
security forces

More Telugu News