Ibomma Ravi: ఐబొమ్మ రవి కేసులో భావోద్వేగం.. తక్కువ శిక్ష పడేలా చూడాలంటూ తండ్రి కన్నీటి విజ్ఞప్తి

Ibomma Ravis Father Apparao Emotional Plea for Leniency
  • తన కొడుకు చేసింది తప్పేనన్న ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు
  • మనవరాలి భవిష్యత్తు గురించే నా ఆందోళన అని వెల్లడి
  • రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి
ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి తండ్రి అప్పారావు స్పందించారు. తన కుమారుడు తప్పు చేశాడని అంగీకరిస్తూనే, తన మనవరాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి తక్కువ శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అప్పారావు మాట్లాడుతూ, "నా కొడుకు చేసింది తప్పే కావచ్చు. కానీ వాడికి ఒక కూతురు ఉంది. నా మీద దయతలిచి వాడిని స్టేషన్‌లో ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా బాధ అంతా నా మనవరాలి గురించే. ఆమె చాలా తెలివైనది. ఆమెను తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కోడలు కూడా తనతో మాట్లాడటం లేదని ఆయన వాపోయారు.

చట్టం ముందు అందరూ సమానమేనని, తన కొడుకును వదిలిపెట్టరని తనకు తెలుసని అప్పారావు అన్నారు. "చట్టానికి జాలి, దయ వంటివి ఉండవు. తప్పు చేసిన వాళ్లంతా ఒక్కటే. నా మనవరాలి కోసం కొడుకును వదిలేయరని తెలుసు. ఇప్పుడు నేను బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు" అని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు.

ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కొత్త సినిమాలను పైరసీ చేస్తూ కోట్లు సంపాదించాడన్న ఆరోపణలతో రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా, అతని తండ్రి చేసిన ఈ భావోద్వేగపూరిత విజ్ఞప్తి అందరినీ కదిలిస్తోంది. 
Ibomma Ravi
Ibomma
Ravi Apparao
Telugu Movies
Piracy Case
Movie Piracy
Cyber Crime
Copyright Infringement
Telugu Film Industry

More Telugu News