Jagadanand Singh: ఈవీఎంలలో ముందే 25 వేల ఓట్లు.. ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం

Jagadanand Singh Alleges EVM Rigging Election Commission Responds
  • ఈవీఎంలలో ముందే 25 వేల ఓట్లు పడ్డాయని ఆర్జేడీ నేత ఆరోపణ
  • సాంకేతికంగా అసాధ్యమని తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం
  • ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తేల్చిన ఎన్నికల సంఘం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఈవీఎంలలో 25 వేల ఓట్ల చొప్పున ఓట్లు పడ్డాయన్న ఆర్జేడీ సీనియర్ నేత జగదానంద సింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఆయన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపింది.

బీహార్ తీర్పు ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించలేదని, ఈవీఎంలలో అవకతవకలు జరిగినందున న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకపోలేదని ఆర్జేడీ సోమవారం పేర్కొంది. పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రతి ఈవీఎంలలో 25 వేల ఓట్లు పడ్డాయని, అయినప్పటికీ తాము 25 సీట్లు సాధించామని జగదానంద సింగ్ అన్నారు.

ఈ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం, ఇది సాంకేతికంగా అసాధ్యమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో అనుసరించిన నిబంధనల ప్రకారం ఇవి తప్పుడు ఆరోపణలని పేర్కొంది. పోలింగ్‌కు ముందు 25 వేల ఓట్లు ఉండటం అనేది అసాధ్యమని తెలిపింది. ఈవీఎంలకు బ్లూటూత్, ఇంటర్నెట్, ఇతర కనెక్షన్లు ఏవీ ఉండవని గుర్తు చేసింది. బయటి నుంచి ఈవీఎంను యాక్సెస్ చేయడం లేదా డిజిటల్ ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపింది.

పోలింగ్‌కు ముందు ఈవీఎంలలో ప్రతి అభ్యర్థికి సున్నా ఓట్లు కనిపిస్తాయని తెలిపింది. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలిపింది. ఆ తర్వాత మాక్ పోల్ ఓట్లను కూడా తొలగిస్తారని వెల్లడించింది. ఈవీఎంల పంపిణీ కూడా ర్యాండమ్‌గా ఉంటుందని, కాబట్టి ఏ ఓటింగ్ యంత్రం ఏ పోలింగ్ కేంద్రానికి వెళుతుందో ఎవరూ చెప్పలేరని స్పష్టం చేసింది. పోలింగ్ ప్రక్రియ ప్రతి దశలో పార్టీల ఏజెంట్లు ఉంటారని తెలిపింది.

రెండు విడతల్లోనూ ఆర్జేడీ ఒక్కసారి కూడా అభ్యంతరాలు చెప్పలేదని ఎన్నికల సంఘం తెలిపింది. జగదానంద్ సింగ్ కూడా ఆధారాలను సమర్పించలేదని వెల్లడించింది. మాక్ పోల్ సర్టిఫికెట్లు, ఫామ్ 17సీ, ఇతర పత్రాలపై ఆర్జేడీ సొంత ఏజెంట్లు సంతకం చేశారని తెలిపింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొంది.
Jagadanand Singh
Bihar Election
EVM tampering
RJD allegations
Election Commission

More Telugu News