SBI Yono App: ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?... ఫ్యాక్ట్‌చెక్ ఇదిగో!

SBI Yono App Blocked Fact Check
  • ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందంటూ నకిలీ సందేశాలు
  • ఆధార్ అప్‌డేట్ కోసం ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేయాలని సూచన
  • ఇది పూర్తిగా మోసమని స్పష్టం చేసిన పీఐబీ, ఎస్‌బీఐ
  • అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని ఖాతాదారులకు హెచ్చరిక
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. 'మీ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుంది' అంటూ నకిలీ సందేశాలను విపరీతంగా వ్యాప్తి చేస్తున్నారు. ఈ మెసేజ్‌లలోని లింక్ ద్వారా ఒక ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని సూచిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా మోసపూరిత చర్య అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ మోసంలో భాగంగా, సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌ను క్లిక్ చేసి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు సహా ఇతర సున్నితమైన సమాచారం మొత్తం వారి చేతికి చిక్కుతుంది. దీంతో క్షణాల్లో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా ఈ నకిలీ సందేశాలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి.

ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పందించింది. ఇవి పూర్తిగా నకిలీ సందేశాలని, ఎస్‌బీఐ గానీ, మరే ఇతర బ్యాంకు గానీ యాప్ అప్‌డేట్‌ల కోసం ఏపీకే ఫైల్స్‌ను పంపదని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదారులను హెచ్చరించింది. "క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఇలాంటి లింకులను క్లిక్ చేయడం, ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ సొమ్మును దొంగిలించే అవకాశం ఉంది" అని తెలిపింది.

ఖాతాదారులు ఏం చేయాలి?
* బ్యాంకింగ్ యాప్‌లను ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దు.
* అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే [email protected] కు ఈమెయిల్ చేయాలి లేదా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి.
* ఆధార్ అప్‌డేట్ అవసరమైతే, నేరుగా ఆధార్ సేవా కేంద్రాలకు లేదా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
SBI Yono App
SBI
State Bank of India
Yono App
Cyber Crime
Phishing
Fraud
PIB Fact Check
Aadhar Update

More Telugu News