Sunil Gavaskar: భారత బ్యాటర్లపై గవాస్కర్ ఫైర్.. స్పిన్ ఆడలేకపోవడానికి కారణం అదే!

Sunil Gavaskar Fires at Indian Batters Reason for Spin Weakness
  • స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారన్న అశ్విన్
  • పాశ్చాత్య దేశాల ఆటగాళ్లే స్పిన్‌ను మెరుగ్గా ఆడుతున్నారని వ్యాఖ్య
  • అశ్విన్ వ్యాఖ్యలను సమర్థించిన సునీల్ గవాస్కర్
  • ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే అసలు సమస్య అని విమర్శ
  • 'వర్క్‌లోడ్' పేరుతో రంజీ ట్రోఫీకి దూరంగా ఉంటున్నారని గవాస్కర్ ఫైర్
ఒకప్పుడు స్పిన్‌ను అలవోకగా ఆడిన భారత బ్యాటర్లు, ఇప్పుడు అదే స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల ఆటగాళ్లు మనకంటే స్పిన్‌ను మెరుగ్గా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఈ బలహీనతకు గల అసలు కారణాలను విశ్లేషించారు.

భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు, ముఖ్యంగా రంజీ ట్రోఫీకి దూరంగా ఉండటమే ప్రధాన సమస్య అని గవాస్కర్ స్పష్టం చేశారు. "మన ఆటగాళ్లలో చాలా మంది దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. అక్కడ ఆడితేనే కదా టర్నింగ్ పిచ్‌లపై ఆడిన అనుభవం వచ్చేది? రంజీ ట్రోఫీలో నాకౌట్‌కు అర్హత సాధించడానికి జట్లు పాయింట్ల కోసం ప్రయత్నిస్తాయి. దీంతో బంతికి గ్రిప్ లభించి, టర్న్ అయ్యే పిచ్‌లను తయారుచేస్తాయి. కానీ మన ఆటగాళ్లెవరూ అక్కడ ఆడటం లేదు" అన్నారు గవాస్కర్.

ఆటగాళ్లు 'వర్క్‌లోడ్' అనే పదాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నారని గవాస్కర్ తీవ్రంగా విమర్శించారు. "వాళ్లకు ఆడాలని లేదు, అందుకే వర్క్‌లోడ్ అనే పదాన్ని వాడుతున్నారు. కేవలం ఫామ్ కోల్పోయినప్పుడు మాత్రమే రంజీ ట్రోఫీ ఆడటానికి వస్తారు. మిగతా సమయాల్లో దానివైపు చూడరు. అలాంటప్పుడు టర్నింగ్ పిచ్‌లపై వారి నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా ఆశించగలం?" అని గవాస్కర్ ప్రశ్నించారు.

గతంలో అశ్విన్ మాట్లాడుతూ "ప్రస్తుతం స్పిన్‌ ఆడటంలో మనం ఉత్తమమని చెప్పలేం. చాలా పాశ్చాత్య జట్లు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే వారు భారత్‌కు వచ్చి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ మనం మాత్రం చేయడం లేదు" అని పేర్కొన్నారు. ఇప్పుడు గవాస్కర్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, టర్నింగ్ పిచ్‌ల కోసం ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటే, దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం ఆడేవారికే అవకాశం ఇవ్వాలని సూచించారు.
Sunil Gavaskar
Indian batsmen
spin bowling
Ranji Trophy
domestic cricket
Ravichandran Ashwin
cricket practice
turning pitches
workload management
Indian cricket

More Telugu News