Nephew Killed: బీహార్ ఎన్నికల ఫలితాలపై గొడవ.. మేనల్లుడి ప్రాణం తీసిన ఇద్దరు మామలు

Madhya Pradesh Men Kill Nephew After Heated Fight Over Bihar Poll Result
  • యువకుడిని బురదలో తొక్కి చంపిన తల్లి తోబుట్టువులు
  • మద్యం మత్తులో మధ్యప్రదేశ్ లో ఘోరం
  • యువకుడు ఆర్జేడీ మద్దతుదారు.. మామలేమో జేడీయూ సపోర్టర్లు
బీహార్ ఎన్నికల ఫలితాలపై మొదలైన చర్చ వివాదంగా మారి ఓ యువకుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో సొంత మేనమామలే ఆ యువకుడిని బురదలో తొక్కి చంపేశారు. ఆర్జేడీకి మద్దతుగా మాట్లాడటం నచ్చక ఈ దారుణానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లోని గుణలో ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ లోని శివ్ హార్ జిల్లాకు చెందిన శంకర్ మాంఝీ (22), రాజేశ్ మాంఝీ (25), తుఫానీ మాంఝీ (27) ఉపాధి కోసం గుణకు వలస వచ్చారు. రాజేశ్, తుఫానీ మాంఝీల మేనల్లుడే (సోదరి కొడుకు) శంకర్ మాంఝీ. 

ముగ్గురూ కూలి పనులు చేస్తూ బీహార్ లోని ఇంటికి డబ్బు పంపిస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ముగ్గురూ కలిసి మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటుండగా చర్చ రాజకీయాలపైకి మళ్లింది. శంకర్ ఆర్జేడీ మద్దతుదారు కాగా అతడి మేనమామలు ఇద్దరూ జేడీయూ అభిమానులు. బీహార్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకోగా.. బీజేపీతో కలిసి కూటమిగా పోటీచేసిన జేడీయూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపైనే మామా అల్లుళ్ల మధ్య మాటామాటా పెరిగింది.

ముగ్గురూ మద్యం మత్తులో ఉండడంతో ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో రాజేశ్, తుఫానీ మాంఝీ ఇద్దరూ కలిసి శంకర్ మాంఝీపై దాడి చేశారు. సమీపంలో ఉన్న బురదలోకి శంకర్ ను ఈడ్చుకెళ్లారు. ఆ బురదలో పడేసి తొక్కడంతో శంకర్ ఊపిరి ఆడక మరణించాడు. గొడవ గురించి చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోపే శంకర్ మృత్యువాత పడ్డాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శంకర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Nephew Killed
Bihar Elections
RJD
JDU
Madhya Pradesh
Bihar Labours
Bihar Assembly
Election Results

More Telugu News