Narayana Murthy: ఈసారి చైనా వర్క్ కల్చర్‌ను తెరపైకి తెచ్చిన నారాయణ మూర్తి

Narayana Murthy on Chinas Work Culture and Indias Growth
  • వర్క్ కల్చర్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన నారాయణ మూర్తి
  • ఈసారి చైనా '9-9-6' పని విధానాన్ని ఉదహరించిన వైనం
  • చైనాతో పోటీ పడాలంటే ఇది తప్పదన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు
  • వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కన్నా ముందు కెరీర్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మరోసారి వర్క్ కల్చర్‌పై కీలక వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త చర్చకు తెరలేపారు. గతంలో భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పి సంచలనం సృష్టించిన ఆయన, ఈసారి చైనాలో ఒకప్పుడు అమల్లో ఉన్న '9-9-6' పని విధానాన్ని ఉదహరించారు. దేశాభివృద్ధి వేగవంతం కావాలంటే యువత ఎక్కువ గంటలు పనిచేయడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన 79 ఏళ్ల మూర్తి చైనా అనుసరించిన కఠోర పనివిధానం వల్లే ఆ దేశం ఆర్థికంగా వేగంగా పురోగమించిందని గుర్తుచేశారు. చైనా టెక్ కంపెనీలలో ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న '9-9-6' విధానం అంటే.. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి ఆరు రోజుల పాటు పనిచేయడం. అంటే, వారానికి మొత్తం 72 గంటల పని అన్నమాట.

తయారీ రంగంలో భారత్ చైనాను అధిగమించగలదా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అది సాధ్యమే కానీ, అందుకు అసాధారణమైన నిబద్ధత అవసరమని స్పష్టం చేశారు. "ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే ఆరు రెట్లు పెద్దది. మనం 6.57 శాతం వృద్ధి రేటుతో పర్వాలేదనిపించినా, వారితో పోటీ పడాలంటే ప్రతి ఒక్కరూ అసాధారణంగా కృషి చేయాలి" అని ఆయన వివరించారు.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించే ముందు యువత తమ కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని మూర్తి పునరుద్ఘాటించారు. "ప్రతి పౌరుడు, అధికారి, రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త.. ఇలా ప్రతి ఒక్కరూ తమకు తాము ఉన్నత ప్రమాణాలు నిర్దేశించుకున్నప్పుడే భారత్ చైనాను అందుకోగలదు" అని ఆయన అన్నారు.
Narayana Murthy
Infosys
China work culture
9-9-6 system
India economic growth
work-life balance
Indian youth
productivity
business
economic development

More Telugu News