Komatireddy Venkat Reddy: ఉపఎన్నికతో ఒక పార్టీ నాలుగు ముక్కలైంది.. మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy By election Split One Party into Four
  • రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కాంగ్రెస్ పాలనేనన్న కోమటిరెడ్డి
  • మరో పార్టీ డిపాజిట్ కోల్పోయి అడ్రస్ లేకుండా పోయిందన్న మంత్రి
  • మిర్యాలగూడలో రూ.74 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన
రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ప్రజల మద్దతు తమకే ఉందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంతో ఒక పార్టీ నాలుగు ముక్కలైందని, మరో పార్టీ డిపాజిట్ కోల్పోయి ప్రజల్లో కనపడకుండా పోయిందని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఒకే కుటుంబంలోని తండ్రి, కుమార్తె, కుమారుడు, అల్లుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వద్ద రూ.74 కోట్లతో నిర్మించనున్న అవంతిపురం-శెట్టిపాలెం నాలుగు లైన్ల రహదారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బీఎల్ఆర్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.60 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రూ.10,410 కోట్లతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించే పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తల అవిశ్రాంత కృషితోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఇదే కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Komatireddy Venkat Reddy
Telangana Congress
Jubilee Hills by-election
BRS party
BJP party
Uttam Kumar Reddy
Nalgonda district
Miryalaguda
Road development
Telangana roads

More Telugu News