Mohsin Naqvi: పాకిస్థాన్ చేతిలో టీమిండియా-ఏ చిత్తు.. పీసీబీ ఛైర్మన్ స్పందన

Mohsin Naqvi Reacts to Pakistan A Victory Over India A
  • రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌పై పాక్ విజయం
  • 8 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్ ఏ జట్టు
  • 136 పరుగులకే కుప్పకూలిన ఇండియా ఏ
  • పాక్ జట్టుపై పీసీబీ ఛైర్మన్ ప్రశంసల వర్షం
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఇండియా ఏ జట్టుకు పాకిస్థాన్ షాహీన్స్ (పాకిస్థాన్ ఏ) జట్టు షాకిచ్చింది. ఆదివారం దోహాలో జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత కుర్రాళ్లు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. ఈ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది రెండో విజయం.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్, భారత బ్యాటర్లను కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు, ఒక దశలో 10 ఓవర్లకు 91/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే, ఆ తర్వాత పాక్ బౌలర్లు పుంజుకోవడంతో 136 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ షాహీన్స్.. మరో 40 బంతులు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

పాకిస్థాన్ విజయంలో ఆల్-రౌండర్ మాజ్ సదాఖత్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అంతకుముందు బౌలింగ్‌లోనూ రాణించి 12 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ విజయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత జట్టుపై తమ ఆటగాళ్లు నిర్భయంగా, ఆధిపత్యంతో కూడిన క్రికెట్ ఆడారని ప్రశంసించారు. "ఇది పాకిస్థాన్‌కు గర్వకారణమైన క్షణం. మా యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. పాకిస్థాన్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. దేశానికి అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. టోర్నీలో ఇది ప్రాథమిక దశలోనే అయినప్పటికీ, చిరకాల ప్రత్యర్థిపై గెలవడంతో పీసీబీ ఛైర్మన్ చేసిన ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కాలంలో ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే తొలి విజయం. సీనియర్ల ఆసియా కప్ 2025లో భారత జట్టు పాక్‌పై మూడుసార్లు గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లోనూ టాస్ సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోకపోవడం గమనార్హం.
Mohsin Naqvi
Pakistan A
India A
Asia Cup Rising Stars
PCB Chairman
Pakistan Cricket Board
Maaz Sadaqat
Cricket Tournament
Doha Cricket Match
Pakistan vs India

More Telugu News