Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం

Chiranjeevi Angry Over Ibomma Owner Stealing Industrys Hard Work
  • ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
  • హైదరాబాద్ పోలీసులను అభినందించిన సినీ ప్రముఖులు
  • రవి లాంటి వారిని కఠినంగా శిక్షించాలన్న చిరంజీవి
  • పైరసీపై యుద్ధంలో సీవీ ఆనంద్, సజ్జనార్ అండగా నిలిచారని ప్ర‌శంస‌
తెలుగు సినీ పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసుల కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఎంతో కష్టనష్టాలకోర్చి సినిమాలు తీస్తుంటే, రవి లాంటి వాళ్లు వేలాది సినీ కుటుంబాల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొన్ని వేల మంది కష్టాన్ని ఒక్కడు దోచుకోవడం సరికాదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు" అని అన్నారు. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ పైరసీపై యుద్ధంలో అండగా నిలిచారని చిరంజీవి ప్రశంసించారు.

రెండు రోజుల క్రితం 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి నుంచి లాగిన్ వివరాలు తీసుకుని వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు. రవి బ్యాంకు ఖాతాల్లోని రూ.3 కోట్లకు పైగా నగదును సీజ్ చేయడంతో పాటు వందలాది హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు. రవి అరెస్ట్‌తో తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
Chiranjeevi
Ibomma
Ibomma Ravi
Telugu film industry
Piracy website
Sajjanar
CV Anand
Tollywood
Movie piracy
Cybercrime

More Telugu News