Saudi Arabia Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం: రంగంలోకి భారత ప్రభుత్వం.. జెడ్డా, ఢిల్లీలో కంట్రోల్ రూమ్‌లు

Saudi bus accident Control room opened at Indian Consulate in Jeddah
  • సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం
  • ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందినట్లు సమాచారం
  • మృతుల్లో తెలంగాణ వాసులు ఉన్నారనే ఆందోళన
  • బాధితుల సహాయార్థం జెడ్డా, ఢిల్లీ, హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌లు
  • రంగంలోకి దిగిన భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం
సౌదీ అరేబియాలో భారత ఉమ్రా యాత్రికులతో వెళుతున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఓ డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 42 మంది యాత్రికులు మరణించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఈ ఘటనపై జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెంటనే స్పందించింది. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్: 8002440003, ఇతర ఫోన్ నెంబర్లు: 0122614093, 0126614276, వాట్సాప్ నెంబర్: 0556122301 అందుబాటులో ఉంచినట్లు ‘ఎక్స్’ ద్వారా తెలిపింది.

తెలంగాణ ప్ర‌భుత్వం కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు హైదరాబాద్ సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. సౌదీలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు హైదరాబాద్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను (91 79979 59754, 91 99129 19545) ప్రకటించారు.

స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయంపై స్పందించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ప్రయాణికుల వివరాలను అధికారులకు అందజేసి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. ఉమ్రా పూర్తి చేసుకుని మదీనా వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Saudi Arabia Bus Accident
Umrah
Indian government
Jeddah
Hyderabad
Telangana
Asaduddin Owaisi
Riyadh

More Telugu News