Rajinikanth: రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం

IFFI to Honor Rajinikanth and Balakrishna for 50 Years in Film
  • రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫిలో అరుదైన గౌరవం
  • 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ప్రత్యేక సత్కారం
  • గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సన్మానించనున్నట్టు కేంద్రం ప్రకటన
ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సత్కరించనున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మానం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అధికారికంగా ప్రకటించారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మురుగన్ ఈ వివరాలను వెల్లడించారు. "రజనీకాంత్, బాలకృష్ణ తమ సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానిస్తాం" అని ఆయన తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.

1975లో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన రజనీకాంత్, తనదైన స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు, బాలకృష్ణ నటుడిగా రాణిస్తూనే సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా, 'అఖండ 2' విడుదలకు సిద్ధమవుతోంది.
Rajinikanth
Balakrishna
IFFI Goa
International Film Festival of India
L Murugan
Pramod Sawant
Akhanda 2
Telugu cinema
Indian cinema
film awards

More Telugu News