DK Shivakumar: పార్టీని ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేయను.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే

Karnataka Deputy CM DK Shivakumar on Party Leadership Change Rumors
  • నాయకత్వ మార్పు, కేబినెట్ లో మార్పులపై జోరుగా ప్రచారం
  • రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న డీకే శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి డీకే శివకుమార్ తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీకే శివకుమార్ తాజాగా స్పందించారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని తాను కాంగ్రెస్ అధిష్ఠానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నటికీ అలా చేయనని ఆయన చెప్పారు.

పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళుతున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా కష్టపడతానని, 2028లో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ విషయంపై స్పందిస్తూ.. ఆ విషయంలో సీఎం సిద్ధరామయ్యకే విశేషాధికారం ఉందన్నారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి అవసరమైన మార్పులను ఆయనే చేస్తారని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 100వ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన కోసం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించేందుకు తాను ఢిల్లీకి వెళ్లనున్నట్లు డీకే తెలిపారు.
DK Shivakumar
Karnataka
Congress
Siddaramaiah
Karnataka Politics
Chief Minister
Malliakarjun Kharge
Rahul Gandhi
Cabinet Expansion
Karnataka Congress

More Telugu News