Ongole: బిల్లుల కోసం కాంట్రాక్టర్ బెదిరింపులు.. ఒంగోలులో ఆఫీసు ముందే ఈఈ ఆందోళన

Ongole EE Nageswara Rao Fears for Life Protests Contractor Harassment
  • ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన
  • ప్రభుత్వ ఆఫీసు ముందే టెంట్ వేసుకుని మరీ నిరసన చేపట్టిన ఈఈ
  • ఒంగోలు ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీసులో 2 నెలల క్రితమే రాక
పాత బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఓ కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భయాందోళనలకు గురయ్యాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తాను పనిచేస్తున్న కార్యాలయం ముందే టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. ఒంగోలులోని ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయంలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

గ్రామీణ నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) గా విధులు నిర్వర్తిస్తున్న నాగేశ్వరరావు ఇటీవల బదిలీపై ఒంగోలు ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయంలో చేరారు. ఆయన ఒంగోలులో బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది. అయితే, రామాంజనేయులు అనే కాంట్రాక్టర్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, పాత బిల్లులు మంజూరు చేయకపోతే చంపేస్తానని ఫోన్ లో బెదిరిస్తున్నాడని నాగేశ్వరరావు వాపోయారు. తన బిల్లులు మంజూరు చేయకుంటే ఫీల్డ్‌లో ఎలా తిరుగుతావో చూస్తానని హెచ్చరించాడట. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే తనను కాంట్రాక్టర్‌ చంపేస్తాడనే భయం వెంటాడుతోందని ఈఈ నాగేశ్వరరావు ఆందోళన చెందుతున్నారు. రామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలులోని తన కార్యాలయం ముందే నిరసన దీక్ష చేపట్టారు. కార్యాలయం ముందే ఈఈ ఆందోళనకు దిగడంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. తమ శాఖ ఉద్యోగి, కాంట్రాక్టర్ మధ్య నెలకొన్న వివాదంపై విచారణ చేపట్టామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Ongole
RWS Office
EE
Contractor Threat
Old Bills
Nageswara Rao
Executive Engineer Protest
Rural Water Supply
Ramajaneyulu
Andhra Pradesh

More Telugu News