Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులు దుర్వినియోగం: ఎన్డీయేపై ప్రశాంత్ కిశోర్ ఆరోపణలు

Prashant Kishor Alleges Misuse of World Bank Funds in Bihar Elections
  • ప్రపంచ బ్యాంకుకు చెందిన రూ.14 వేల కోట్లను ఓట్ల కోసం వాడారని విమర్శ
  • మహిళల ఖాతాల్లో వేసిన రూ.10 వేలు ఈ నిధుల్లోంచేనని వెల్లడి
  • ఓట్లు కొనేందుకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందన్న ప్రశాంత్ కిశోర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) అధికార ఎన్డీయే కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన రూ.14 వేల కోట్ల నిధులను ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల సమయంలో దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు. ఈ నిధులను మళ్లించి, ఎన్నికలకు ముందు మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారని ఆయన ఆరోపించారు.

ప్రశాంత్ కిశోర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నుంచి ఎన్నికల ప్రకటన వెలువడే వరకు నితీశ్ ప్రభుత్వం ఓట్లను కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

బీహార్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన' పథకం కింద 75 లక్షల మంది మహిళలకు నవరాత్రి కానుకగా రూ.10 వేలు అందించింది. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకే ఈ నగదు అందించామని, భవిష్యత్తులో ఈ సహాయం రూ.2 లక్షల వరకు పెంచుతామని అప్పట్లో ప్రధాని మోదీ, బీహార్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం వెనుక ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశం ఉందని ప్రశాంత్ కిశోర్ ఆరోపిస్తున్నారు. 
Prashant Kishor
Bihar Elections
World Bank Funds
NDA
Nitish Kumar
Jan Suraaj Party
Bihar Government
Election Commission
Corruption
Mahila Rojgar Yojana

More Telugu News