Vangaveeti Ranga: ప్రజా జీవితంలోకి వంగవీటి రంగా కుమార్తె.. రాజకీయాలపై కీలక ప్రకటన

Vangaveeti Asha Kiran to Strengthen Radha Ranga Mitra Mandali
  • ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన వంగవీటి ఆశా కిరణ్
  • పేద, బలహీన వర్గాలకు అండగా నిలుస్తానని వెల్లడి
  • రాజకీయ ప్రవేశంపై మిత్రమండలితో చర్చించాకే నిర్ణయమని స్పష్టీక‌ర‌ణ‌
  • తండ్రిలాగే అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తానని హామీ
  • అన్నయ్య రాధాకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవన్న ఆశా కిరణ్
  • దారులు వేరైనా తమ ఇద్దరి గమ్యం ఒక్కటేనని వ్యాఖ్య
దివంగత నేత వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్ తాను ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం విజయవాడలోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ.. "ఇకపై నేను ప్రజా క్షేత్రంలో ఉంటాను. అయితే, రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో రాధా-రంగా మిత్రమండలి పెద్దలతో చర్చించి, వారి సలహాలు తీసుకున్నాకే రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇస్తాను" అని తెలిపారు. తన తండ్రి ఏ కులానికో, మతానికో పరిమితం కాలేదని, ఆయన బాటలోనే తాను కూడా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

అనంతరం తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణతో ఉన్న సంబంధంపై ఆమె స్పందించారు. "మా అన్నాచెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఒకే రక్తం పంచుకు పుట్టాం. దారులు వేరైనా మా ఇద్దరి గమ్యం ఒక్కటే. ఆయన సహకారం నాకు ఎప్పుడూ ఉంటుంది" అని ఆమె స్పష్టం చేశారు. రాధా-రంగా మిత్రమండలిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రంగా అభిమానులందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆశా కిరణ్ హామీ ఇచ్చారు.
Vangaveeti Ranga
Vangaveeti Asha Kiran
Asha Kiran
Vangaveeti Radha
Radha Ranga Mitra Mandali
Vijayawada
Andhra Pradesh Politics
Telugu Politics
Public Service
Political Entry

More Telugu News