Guntur: కిడ్నీ చికిత్సకు వెళ్తే కోమాలోకి.. భర్త ప్రాణాల కోసం భార్య పోరాటం

Wifes Fight to Save Husband in Coma After Kidney Treatment in Guntur
  • కిడ్నీ సమస్య చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్లిన వ్యక్తి కోమాలోకి
  • గత 8 నెలలుగా మంచానికే పరిమితమైన గౌరీశంకర్
  • భర్త వైద్యం కోసం పుస్తెల తాడు అమ్ముకున్న భార్య
  • ఇప్పటికే రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేసిన కుటుంబం
  • ఆపరేషన్ అవసరం లేకపోవడంతో వర్తించని ఆరోగ్యశ్రీ
  • ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి, దాతలకు కుటుంబం విజ్ఞప్తి
విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం వీధిన పడింది. కిడ్నీ సమస్యకు చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్లిన ఓ వ్యక్తి, గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. గత 8 నెలలుగా జీవచ్ఛవంగా మారిన భర్తను బతికించుకునేందుకు ఆ భార్య చేస్తున్న పోరాటం కంటతడి పెట్టిస్తోంది. గుంటూరు నగర పరిధిలోని ఏటుకూరుకు చెందిన అన్నాబత్తుల గౌరీశంకర్ (53) లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో కమీషన్ ఏజెంట్‌గా పనిచేసేవారు.

ఈ ఏడాది ఏప్రిల్ 12న కిడ్నీ సంబంధిత సమస్యతో ఆయన ఆసుప‌త్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వైద్య సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్ చేస్తుండగానే ఆయన మెదడు స్తంభించి కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన శరీరంలో ప్రాణం ఉంది కానీ, ఎలాంటి చలనం లేదు. పలువురు వైద్య నిపుణులను సంప్రదించగా, ఇది సర్జరీ చేసి నయం చేసే బ్రెయిన్ స్ట్రోక్ కాదని, ఆపరేషన్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

నెల రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు. అప్పటికే దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవడంతో ఆర్థిక స్థోమత లేక గౌరీశంకర్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆయన భార్య స్వప్న తన భర్తను బతికించుకోవడానికి సర్వం ధారపోశారు. ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు చివరికి మెడలోని పుస్తెలు కూడా అమ్మి వైద్యం చేయించారు. 

ప్రస్తుతం ప్రతినెలా మందులకే రూ.20 వేల వరకు ఖర్చవుతోందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. గౌరీశంకర్‌కు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ, ఆయన పరిస్థితికి ఆపరేషన్ అవసరం లేకపోవడంతో అది వర్తించలేదు. దీంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు దాతలు స్పందించి తన భర్త ప్రాణాలను కాపాడాలని స్వప్న వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకునే వారు 9949546636 నంబరులో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Guntur
Annabathula Gauri Shankar
Kidney treatment
Coma
Heart attack
Financial crisis
Medical expenses
CM Chandrababu
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News