Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు మాటలను వక్రీకరిస్తున్నారు: పల్లా శ్రీనివాస్

Palla Srinivasa Rao Slams Misinterpretation of Chandrababus Steel Plant Comments
  • విశాఖ ఉక్కుపై అపోహలు సృష్టించొద్దన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
  • స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్నది ఎన్డీయే ప్రభుత్వమేనని ఉద్ఘాటన 
  • ఉక్కు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ ప్రజలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిని లాభాల బాట పట్టించేందుకే చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, "నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.11,400 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీరు, విద్యుత్, పన్నుల రూపంలో మరో రూ.2,600 కోట్లు కలిపి దాదాపు రూ.14,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో అండగా నిలిచిన దాఖలాలు లేవు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని నిజం చేస్తూ, కార్మికులు, నిర్వాసితుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం" అని వివరించారు.

"ప్రభుత్వం ప్రజాధనాన్ని, పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ప్లాంట్ కోసం వెచ్చిస్తోంది. కాబట్టి యాజమాన్యం, కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలని చెప్పడమే ముఖ్యమంత్రి ఉద్దేశం. కానీ, వైసీపీ నాయకులతో కలిసి కొందరు ఆయన మాటలను వక్రీకరించి కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అత్యంత దారుణం" అని పల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు రూ.1350 కోట్లు, ఆ తర్వాత మరోసారి రూ.1440 కోట్లు తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

"కేవలం 30 శాతం పనులు జరుగుతున్న ప్లాంట్‌ను 80 శాతం పనులు జరిగేలా చేశాం. ఈ రోజు స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే అది ఎన్డీయే కూటమి చలవే. ఈ నిజాన్ని కార్మికులు, ప్రజలు గ్రహించాలి. అనవసరంగా అధికారులపై బురదజల్లడం, కార్మికులలో భయాందోళనలు సృష్టించడం వంటి చర్యలను ప్రతిపక్షాలు మానుకోవాలి. ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులతో పాటు ప్రతిపక్షం కూడా బాధ్యతగా వ్యవహరించి, స్టీల్ ప్లాంట్‌ను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలి" అని పల్లా శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజలు విజ్ఞులని, ఇలాంటి వక్రీకరణలను నమ్మబోరని, ఎన్డీయే కూటమిపై వారికి అపారమైన విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.
Palla Srinivasa Rao
Visakha Steel Plant
Vizag Steel Plant
Chandrababu Naidu
TDP
Privatization
Steel Plant Revival
Andhra Pradesh
Steel Industry
Financial Assistance

More Telugu News